సమష్టిగా నిలబడి ఎల్-నినోను ఎదుర్కొందాం
– రైతులు, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
– అన్ని శాఖలు మిషన్ మోడ్‌లో పనిచేయాలి
– అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
రంగా రెడ్డి అక్షిత బ్యూరో :
ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో మిషన్ మోడ్‌లో పని చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు.మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధ్యక్షతన ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమీక్షా సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, సంభావ్య వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, కంటింజెన్సీ ప్లాన్‌లను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, అవసరమైన విత్తనాల సరఫరా, తాగునీటి ఏర్పాట్లు, పశువులకు మేత, ఉపాధి హామీ పనులు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సేవలు వంటి అంశాల్లో ఎలాంటి లోటు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పెసర, కంది, జొన్న, రాగులు వంటి పంటలను ప్రోత్సహించాలని, రైతులకు అవసరమైన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను వెంటనే అందుబాటులో ఉంచాలని సూచించారు. పశువులకు పశుగ్రాసం కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా జల వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని తెలిపారు. అవసరమైన చోట కొత్త బోర్లు తవ్వించడం, తాగునీటి బోర్లకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించడం, స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రకృతి వైపరీత్యాలను నివారించడం సాధ్యం కాకపోయినా, ముందస్తు ప్రణాళికలు, సమన్వయంతో వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చని స్పీకర్ పేర్కొన్నారు. ఎల్-నినో ప్రభావంతో ఏర్పడే అనావృష్టి పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించడం జిల్లా యంత్రాంగం బాధ్యత అని, అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పంటలు, ఉద్యాన పంటలు, పండ్ల తోటలు, పూల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. మండల స్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో వరి సాగు అధికంగా ఉండటంతో, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులకు తగిన సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని సూచించారు. తాగునీటి కొరత తలెత్తకుండా ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేయాలని, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వ్యవసాయ శాఖ రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంతో పాటు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, ఉద్యానవన, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు తమ తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేశారు.సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల యాక్షన్ ప్లాన్‌లు, కంటింజెన్సీ ప్రణాళికలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం తెలంగాణ జలసిరి పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్లు సవ్యసాచి, వికాస్ రాజ్, శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, వీర్లపల్లి శంకర్, మనోహర్ రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, శాసన మండలి సభ్యులు దయానంద్, జిల్లా అదనపు కలెక్టర్లు కె. కిరణ్మయి, చంద్రారెడ్డి, డీఆర్ఓ శారద, మున్సిపల్ చైర్మన్లు, ఆర్డీఓలు, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, భూగర్భ జలాలు, నీటిపారుదల తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
