లీప్ సిటీస్ ఇండెక్స్‌లో కరీంనగర్‌కు 21వ స్థానం
హర్షం వ్యక్తం చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్ అక్షిత బ్యూరో
న్యూఢిల్లీకి చెందిన లీప్ ఇన్‌సైట్స్ ఫౌండేషన్ విడుదల చేసిన లీప్ సిటీస్ ఇండెక్స్–2026 లో దేశవ్యాప్తంగా ఉన్న 233 నాన్-మెట్రో నగరాల్లో కరీంనగర్ నగరం 21వ స్థానంలో నిలవడం పట్ల నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.ఈ ఇండెక్స్‌లో కరీంనగర్ నగరం 100కు 60.3 కాంపోజిట్ స్కోరు సాధించి, మహారాష్ట్రలోని ఇచల్‌కరంజి తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు కంటే ముందు స్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా లివింగ్ ఫౌండేషన్ విభాగంలో దేశంలోనే 6వ ర్యాంకుతో 77.4 స్కోరు సాధించడం గర్వకారణమని మేయర్ పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి రంగాల్లో నగరం సాధించిన పురోగతికి ఇది నిదర్శనమని తెలిపారు. వాణిజ్యం-ఆతిథ్య రంగం, నిర్మాణ రంగాల్లో కూడా కరీంనగర్ మంచి స్కోర్లు నమోదు చేయడం నగర ఆర్థికాభివృద్ధికి సంకేతమని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నైట్‌టైమ్ లైట్స్ వృద్ధి 11.9 శాతంగా నమోదవడం నగరంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని సూచిస్తోందన్నారు.టాప్–50 జాబితాలో స్థానం పొందిన తెలంగాణ నగరాల్లో కరీంనగర్ ఒకటిగా నిలవడం ప్రతి కరీంనగర్ వాసికి గర్వకారణమని మేయర్ తెలిపారు. జనగణన, ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5, ఆర్‌బీఐ డేటా, ఉపగ్రహ చిత్రాలు తదితర అంశాల ఆధారంగా 43 సూచికలతో ఈ ఇండెక్స్ రూపొందించబడిందని గుర్తు చేశారు.ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో కరీంనగర్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసి, భవిష్యత్తులో దేశంలోని అగ్రగామి నగరాల సరసన నిలబెట్టేందుకు మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు, ప్రజల సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. కరీంనగర్ నగర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, మునిసిపల్ సిబ్బంది, నగర ప్రజలందరికీ ఈ సందర్భంగా మేయర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
