పేరుకే ఆస్పత్రి.. వైద్యం దొరక్క ప్రజల అవస్థలు!
– 20 రోజులుగా వైద్య పరీక్షలు నిలిచిపోయాయి..
– మందులు, ఇంజక్షన్లు కరువు
– డీఎంహెచ్‌ఓ, సంబంధిత అధికారులకు టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేత
– సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల తరఫున పోరాటం: టీడీపీ
రామన్నపేట అక్షిత ప్రతినిధి
మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు సక్రమంగా అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను టీడీపీ మండల ఇన్‌చార్జి మీర్జా పజిల్ బేగ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి నకిరేకంటి గణేష్, నాయకులు బత్తుల సత్యం, వడ్లకొండ సత్తయ్య పరిశీలించారు. ఆస్పత్రిలో దాదాపు 20 రోజులుగా వైద్య పరీక్షలు నిర్వహించడం లేదని టీడీపీ నాయకులు తెలిపారు. రోగులకు అవసరమైన మందులు, ఇంజక్షన్లు, గాయాలకు ఉపయోగించే ఆయింట్‌మెంట్లు సైతం అందుబాటులో లేవని పేర్కొన్నారు. దీంతో వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న పేద, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, రోగులకు అవసరమైన మందులు, ఇంజక్షన్లు అందుబాటులో ఉంచడంతో పాటు వైద్య పరీక్షల సదుపాయాలను పునరుద్ధరించాలని కోరుతూ డీఎంహెచ్‌ఓ, సంబంధిత అధికారులకు టీడీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద ప్రజలకు సకాలంలో వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. తక్షణమే సమస్యలను పరిష్కరించకపోతే ప్రజల తరఫున ఆందోళన చేపట్టి, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.