జ్ఞానేష్ కుమార్ వైఖరిని నిరసిస్తూ యువజన కాంగ్రెస్  ఆందోళన

జ్ఞానేష్ కుమార్ వైఖరిని నిరసిస్తూ యువజన కాంగ్రెస్  ఆందోళన 

 – దిష్టిబొమ్మ దహనం..

– రాజీనామా చేయాలని డిమాండ్

రామన్నపేట, అక్షిత ప్రతినిధి :

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామన్నపేట యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్లను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తొలగించారని విమర్శించారు. ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పలు ఆందోళనలు చేపడుతోందన్నారు. జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ ఆదేశాల మేరకు జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేటలో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని బట్టె సంతోష్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పున్న అమరేందర్, మండల ఉపాధ్యక్షుడు కేస సాయి, పట్టణ అధ్యక్షుడు జవ్వాజి శ్రీకాంత్, కొమ్మగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు వీరమల్ల పరుశురాం, ఇస్కిల్లా గ్రామ శాఖ అధ్యక్షుడు బందెల వినయ్, పట్టణ కార్యదర్శి కామిటికారి సాయి వెంకట్, సుర్వి మచ్చ గిరి, సుర్వి రాకేష్, పాషా, సింగరాయబోయిన అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking