యథావిధిగా తాగునీటి సరఫరా

యథావిధిగా తాగునీటి సరఫరా

– పైప్‌లైన్‌ షిఫ్టింగ్‌ పనులు పూర్తి

– శుక్రవారం ట్రయల్‌ రన్‌

– 3–4 ట్యాంకర్లతో ప్రత్యామ్నాయంగా నీటి సరఫరా

– క్యాతనపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ మురళీకృష్ణ

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల కారణంగా నిలిచిపోయిన తాగునీటి సరఫరా శనివారం నుంచి యథావిధిగా పునరుద్ధరిస్తామని క్యాతనపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ మురళీకృష్ణ తెలిపారు. రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న తాగునీటి పైప్‌లైన్లను పక్కకు తరలించే పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న ఆర్‌ఓబీ నుంచి ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈ పనుల్లో భాగంగా పైప్‌లైన్లను షిఫ్టింగ్‌ చేయడంతో ఆర్‌కే-4 గడ్డ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కమిషనర్‌ తెలిపారు.ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్‌ ఆధ్వర్యంలో 3 నుంచి 4 ట్యాంకర్ల ద్వారా అవసరమైన వార్డులకు ప్రత్యామ్నాయంగా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పైప్‌లైన్‌ షిఫ్టింగ్‌ పనులు పూర్తయ్యాయని, శుక్రవారం ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని తెలిపారు. ట్రయల్‌ రన్‌లో ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే సరిచేస్తామని పేర్కొన్నారు.శనివారం నుంచి మిషన్‌ భగీరథ ద్వారా గతంలో మాదిరిగానే అన్ని వార్డులకు క్రమం తప్పకుండా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ స్పష్టం చేశారు. పనులు పూర్తయ్యేందుకు మరో రోజు సమయం పడుతున్నందున పట్టణ ప్రజలు సహకరించి, సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking