ఎమ్మెల్సీ ఓటర్లుగా ఉద్యమకారులు నమోదు కావాలి

ఎమ్మెల్సీ ఓటర్లుగా ఉద్యమకారులు నమోదు కావాలి

– చట్టసభల్లో తెలంగాణ ఉద్యమకారుల గొంతుక వినిపించాలి

ఉప్పల్ అక్షిత ప్రతినిధి, అక్టోబర్ 8:

డిగ్రీ అర్హత కలిగిన ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డా. చీమ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల గొంతుక శాసనమండలిలో వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన ఉద్యమకారులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఎన్నో ఏళ్లపాటు పోరాటాలు చేసి, అనేక త్యాగాలు చేశారని డా. చీమ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా ఉద్యమకారులకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం దక్కడం లేదని పేర్కొన్నారు. చట్టసభల్లో ఉద్యమకారుల సమస్యలు, హక్కులు, సంక్షేమ అంశాలను బలంగా ప్రస్తావించేందుకు వారికి రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ హక్కుల సాధన కోసం కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. ఉద్యమకారులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడంతో పాటు వార్డు సభ్యుడి స్థాయి నుంచి పార్లమెంటు వరకు కనీసం 20 శాతం రాజకీయ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంటు వంటి చట్టసభల్లో ఉద్యమకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తే వారి సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన ప్రతి ఉద్యమకారుడు తప్పనిసరిగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని డా. చీమ శ్రీనివాస్ సూచించారు. ఓటరు నమోదు విషయంలో అర్హత కలిగిన కుటుంబ సభ్యులు కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుకు రావాలని కోరారు. ఉద్యమకారుల సంఖ్యకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం, హక్కుల సాధన కోసం ఈ నమోదు ప్రక్రియను ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఇదిలా ఉండగా, ఎర్రవల్లిలో అమరవీరుల కాలనీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డా. చీమ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలను గుర్తిస్తూ వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగన్ యాదవ్, జోగు అంజయ్య, దుగ్గని శ్యామల, ఆర్.కె. భూపాల్, మంజూష, భాను ప్రకాష్ రెడ్డి, శ్యామల చంద్రశేఖర్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking