పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ అక్షిత ప్రతినిధి, అక్టోబర్ 8:

డా. ఏఎస్ రావు నగర్ వార్డు నం.15 పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే దిశగా రూ.1.83 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఏడు అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులను చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు రహదారి సౌకర్యం మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం లభించనుంది. అయ్యప్ప స్వామి దేవాలయం, సౌత్ కమలా నగర్ బైలేన్లు, మహేష్ నగర్ నుంచి గాయత్రి నగర్ వరకు ఉన్న రోడ్డు, నాయక్రాంతి నగర్ నుంచి నేతాజీ నగర్ జంక్షన్, శ్రీనివాస్ నగర్, కమలా నగర్, శ్రీనగర్ కాలనీ, సుభాష్ చంద్ర నగర్, న్యూ శ్రీనివాస్ నగర్, వీ.ఎన్. రెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అయ్యప్ప స్వామి దేవాలయం, సౌత్ కమలా నగర్ పరిధిలో సీసీ రోడ్లు, బైలేన్ల నిర్మాణానికి రూ.30.50 లక్షలు, మహేష్ నగర్ నుంచి గాయత్రి నగర్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.19 లక్షలు కేటాయించారు. నాయక్రాంతి నగర్ ప్లాట్ నం.58 నుంచి నేతాజీ నగర్ జంక్షన్ వరకు స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి రూ.52 లక్షలు మంజూరయ్యాయి. ఆటోస్టాండ్, శ్రీనివాస్ నగర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలోని కమలా నగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.18 లక్షలు, పోచమ్మ దేవాలయం, శ్రీనగర్ కాలనీలో సీసీ రోడ్లకు రూ.16.50 లక్షలు కేటాయించారు. అలాగే సుభాష్ చంద్ర నగర్‌లో హెచ్.నెం. 9-124/బి నుంచి రిమ్ డిజైన్ టెక్నాలజీస్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.28 లక్షలు, న్యూ శ్రీనివాస్ నగర్‌లోని 10, 11, 12 రోడ్లతో పాటు వీ.ఎన్. రెడ్డి నగర్‌లో కల్వర్ట్ సమీపంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.19 లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. డా. ఏఎస్ రావు నగర్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల పూర్తితో ఆయా కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు శిరీష సోమ శేఖర్ రెడ్డి, కొత్త రామారావు, మాజీ డివిజన్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కాలనీ వాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking