రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
– కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
రాయపర్తి అక్షిత ప్రతినిధి
మండలంలోని మైలారం గ్రామంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు పోలీసులు, తెలిపిన వివరాల మేరకు రెడ్లవాడ గ్రామానికి చెందిన సరస్వతి (48) మైలారం గ్రామంలోని తన కూతురు వద్ద ఉంటుంది. గురువారం ఉదయం ఆమె రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఆమెను వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.దింతో సరస్వతి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు కాగా..తలకు బలమైన గాయమవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ఆపకుండా డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు కుమార్తె గడి దాసు నవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అన్నారు.