వార్డు మెంబర్ల ఫోరం కో-ఇన్‌చార్జిగా చిన్నపాక రమేష్
– వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి
– గనగాని రమేష్
రామన్నపేట అక్షిత ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం నకిరేకల్ నియోజకవర్గ కో-ఇన్‌చార్జిగా చిన్నపాక రమేష్ ఎన్నికయ్యారు. శుక్రవారం రామన్నపేటలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గనగాని రమేష్ ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గనగాని రమేష్ మాట్లాడుతూ వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం, ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. హెల్త్ కార్డులు, మరణించిన వార్డు సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై వార్డు సభ్యుల పేర్లు నమోదు చేసి, వారికి తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని కోరారు. వార్డు సభ్యుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఫోరం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.