బతుకమ్మ పండుగ సందర్భంగా విద్యార్థులకు కొత్త బట్టల పంపిణీ
– రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి పుల్లయ్య ఔదార్యం.. 30 మంది విద్యార్థులకు వస్త్రాల వితరణ
కాజీపేట, అక్షిత ప్రతినిధి :
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్త బట్టలు అందించి రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఇట్టే పుల్లయ్య తన ఉదారతను చాటుకున్నారు. శుక్రవారం ఆర్‌ఈసీ పాఠక్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులకు సుమారు రూ.10 వేల విలువైన కొత్త బట్టలను ఆయన పంపిణీ చేశారు. పండుగ వేళ విద్యార్థుల ముఖాల్లో ఆనందం నింపాలనే ఉద్దేశంతో పుల్లయ్య ఈ సహాయాన్ని అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారి సంతోషంలో భాగస్వాములు కావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల ఆయన చూపిన ఆప్యాయత, ఔదార్యానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె. రఘోత్తమరెడ్డి, ఉపాధ్యాయులు ఆర్. శోభ, కె. అరుణజ్యోతి, కె. సంధ్య కృతజ్ఞతలు తెలిపారు. పండుగ సందర్భంగా కొత్త బట్టలు అందుకోవడం విద్యార్థులకు ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తినిస్తాయని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దండు మహేందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.