చేపలు, తాబేళ్ల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మోతే కిరణ్
– శుక్రవారం గల్లంతు.. శనివారం ఉదయం మృతదేహం వెలికితీత
– మృతుడి కుటుంబ సభ్యుల అనుమానాలు.. ఘటనపై పోలీసుల దర్యాప్తు
రాజన్న సిరిసిల్ల అక్షిత బ్యూరో
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని చెరువులో మునిగి మోతే కిరణ్ అనే యువకుడు మృతి చెందాడు. చేపలు, తాబేళ్ల వేటకు వెళ్లిన యువకుడు చెరువులో గల్లంతై ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. శుక్రవారం చెరువులో గల్లంతైన కిరణ్ మృతదేహాన్ని శనివారం ఉదయం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం వెలికితీసింది. వివరాల్లోకి వెళితే.. మోతే కిరణ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వెంకటాపూర్ గ్రామ శివారులోని చెరువు వద్దకు చేపలు, తాబేళ్ల వేటకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో కిరణ్ చెరువులో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం రంగంలోకి దిగి గాలింపు చేపట్టి శనివారం ఉదయం కిరణ్ మృతదేహాన్ని వెలికితీసింది.
కుటుంబ సభ్యుల అనుమానాలు..
కిరణ్ మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్నేహితుల ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి తమకు న్యాయం చేయాలని కోరాలని బంధువులు యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఘటనకు సంబంధించిన వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ముగ్గురు చిన్నపిల్లలకు తండ్రిని దూరం చేసిన ఘటన..
కిరణ్ మృతితో అతని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మృతుడికి భార్య సుమతో పాటు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న కిరణ్ మృతి చెందడంతో భార్య, పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో వెంకటాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల దర్యాప్తు..
మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిరణ్ మృతికి దారితీసిన పరిస్థితులు, కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
