అక్షిత ఎఫెక్ట్… నిర్మల్ మాల్స్ ట్రాఫిక్ ఇక్కట్లపై ఎస్పీ స్పందన!

అక్షిత ఎఫెక్ట్… నిర్మల్ మాల్స్ ట్రాఫిక్ ఇక్కట్లపై ఎస్పీ స్పందన!

– పార్కింగ్ లేదు.. సెట్ బ్యాక్ లేదు.. అక్షిత కథనానికి పోలీస్ శాఖ రియాక్షన్

నిర్మల్, అక్షిత న్యూస్:

నిర్మల్ పట్టణంలోని షాపింగ్ మాల్స్ వద్ద పార్కింగ్ సౌకర్యం లేక, సెట్ బ్యాక్స్ ఆక్రమించి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని, అనుమతులు లేకుండా ఎలా నడుస్తున్నాయంటూ అక్షిత దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. అక్షిత కథనాన్ని సీరియస్ గా తీసుకున్న నిర్మల్ ఎస్పీ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఇంచార్జ్ సాయికిరణ్, ఐపీఎస్ చొరవ తీసుకుని నాలుగు ప్రధాన షాపింగ్ మాల్స్ యాజమాన్యాలను పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. సీబీఎస్ షాపింగ్ మాల్, మాంగల్య షాపింగ్ మాల్, ఆనంద్ షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్ లకు 6 అక్టోబర్ 2026న పోలీసులు నోటీసులు జారీ చేసి, తమ కస్టమర్లకు సరైన పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని కఠినంగా ఆదేశించారు. ఈ మేరకు ఎస్పీ నిర్మల్ అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రకటన విడుదల చేశారు.

షాపింగ్ మాల్ యాజమాన్యాలు తమ కస్టమర్లకు సరైన పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులు మరియు జిల్లా యంత్రాంగంలోని ఇతర భాగస్వామ్య శాఖలకు కూడా తెలియజేశాము. నిర్మల్ టౌన్ పోలీసుల ద్వారా నోటీసులు జారీ చేశాము. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అమలు చర్యలు కొనసాగుతాయి.

– నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలా

 

అక్షిత కథనానికి సత్వరమే స్పందించిన నిర్మల్ పోలీస్ శాఖకు స్థానిక ప్రజలు, వాహనదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking