ఫాంహౌస్ లో కాదు
అసెంబ్లీకిరా..
మా తప్పులేంటో చెప్పి… సలహాలివ్వు
మేం ఓడినా…
ప్రజాక్షేత్రంలో నిలబడలేదా..?
ప్రతిపక్ష కుర్చీ
ఖాళీ ఎందుకు?
తొలి ఏడాదిలోనే ఉద్యోగాలు, రుణమాఫీ
తప్పని నిరూపిస్తే
ఢిల్లీ గడ్డపై క్షమాపణలు చెప్తా..
నల్గొండ ప్రజా
విజయోత్సవ సభలో
సీఎం రేవంత్ రెడ్డి
నల్గొండ, అక్షిత బ్యూరో :
మేం ఓడినా… ప్రజాక్షేత్రంలోనే నిలబడ్డాం…గెలిస్తే ఉప్పొంగిపోవడం,
ఓడిపోతే కుంగిపోయి ఫామ్హహౌస్ లో పడుకోవడం మీ స్థాయికి, హోదాకు తగదని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చురకలంటించారు. కేసీఆర్.. అసెంబ్లీకి రా.. మా తప్పులేంటో చెప్పు.. అని సవాల్ విసిరారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెంలో ప్రజా విజయోత్సవాల ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ ‘మేమందరం ఎన్నికల్లో పోటీ చేయలేదా? ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉండలేదా?.. ఒకటి కాదు రెండుసార్లు మీరు గెలిచారు.. మేం ఓడిపోయాం.. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి, భట్టి విక్రమార్క నిరంతరం ప్రజల మధ్యలో ఉండి శాసనసభలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయలేదా?.. నంబర్లు ముఖ్యం కాదు. ప్రజా సమస్యలను చట్టసభలో ప్రస్తావించడం ముఖ్యం..’ అని అన్నారు. ఈ ఏడాది కాలంలో ఏనాడైనా మీరు ప్రతిపక్ష పాత్ర పోశించారా? మీ అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం వినియోగించారా? కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 కోట్ల ప్రజలు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈ రోజు ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉంచడం ఈ తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఓటమిని మేం చూశాం. ఎమ్మెల్యేగా నేను ఓడిపోయా.. ఎంపీగా మళ్లీ గెలిచి పార్లమెంట్ లో తెలంగాణ గళాన్ని వినిపించానని గుర్తు చేశారు. మరి మీరెందుకు బయటకు రావడం లేదు.. మాట్లాడటం లేదని నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోయి ఒక గాలి బ్యాచ్ ను తయారు చేసి ఊరిమీదకు వదిలారని మండిపడ్డారు. వారు ఏం మాట్లాడుతున్నారో వింటున్నారా..? పరిశ్రమలు, పెట్టుబడులు, పరీక్షలు ఏవి పెడతామంటే వారు వద్దంటున్నారు. ఇది తెలంగాణ భవిష్యత్ కు మంచిదా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఈ దేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు, రూ.21 వేల కోట్ల రుణమాఫీ జరిగింది కేవలం తెలంగాణలోని ప్రజా ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం తమ ప్రభుత్వం మాత్రమే చేసి చూపిందన్నారు. ఈ వివరాలన్నీ లెక్కకట్టి మరీ అసెంబ్లీలో వివరిస్తానని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇది జరిగిందని నిరూపిస్తే ఢిల్లీ నడిబజార్లో తలవంచుకుని క్షమాపణలు చెప్తానని, లేకుంటే మీ నాయకులు మా ప్రభుత్వ పని తీరును అభినందించాలని ప్రధాని మోడీకి సవాల్ విసిరారు.’బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మా గడ్డపైకి వచ్చారు.. ఇక్కడ అడ్డగో లుగా మాట్లాడకండి..’ అని రేవంత్ హితవు పలికారు.
బీఆర్ఎస్ మాట్లాడిన ప్రెస్మిట్ కాగితాలనే కిషన్ రెడ్డి ,ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. వరి వేస్తే ఉరి వేసుకోవాల్సి వస్తుందని కేసీఆర్ చెప్తే ఇవాళ సన్న వడ్లు పండిస్తే మూడు రోజుల్లోనే ధాన్యం డబ్బులు ఇవ్వడమే కాకుండా రూ.500 బోనస్ ఇస్తూ వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా తొలుత నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారం భించారు. అనంతరం రిజర్వాయర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు మోటార్ల ద్వారా నీటిని రిజర్వాయర్లోకి వదిలారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్-2ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ యూనిట్ -2లో 800. మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.