బ్రోకర్ల దందా
బ్రోకర్ చెప్తేనే ధాన్యం కొనుగోలు
రైతులను నిండా ముంచుతున్న మిల్లర్లు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
రైతులు మిల్లుకు ధాన్యం అమ్మేందుకు వెళ్ళితే పడిగాపులు… అదే బ్రోకర్ వస్తే ఠక ఠక్ గా అమ్మకాలు. ఇది మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ ధాన్యం కొనుగోళ్లు. రైస్ మిల్లుల వద్ద బ్రోకర్లు ధాన్యానికి నిర్ణయించినదే తుది ధర (ఫైనల్ రేటు).రైస్ మిల్లులకు సమీపంలోనే ట్రాక్టర్లో రైతులు తెచ్చిన ధాన్యానికి బ్రోకర్లు
షీకుల ద్వారా శాంపిల్ ధాన్యం సేకరించి పరిశీలిస్తారు.ప్రతి ట్రాక్టర్ లోడు ధాన్యానికి రూ.500 రూపాయలు రైతు బ్రోకర్ కు చెల్లించాల్సిందే..!ధాన్యం శీకుల ద్వారా పరిశీలన చేస్తున్న సమయంలోనే బ్రోకర్లు ముందస్తుగానే ధాన్యం సరిగా లేదని తాళ్లు పచ్చిగా ఉందని సాకులు చెప్పి.. ఈ రేటు వచ్చినా ధాన్యం రైతు అమ్మే విధంగా సిద్ధం చేస్తున్నారు బ్రోకరు.బ్రోకర్లు అనుకున్న ధరకు రైతు ధాన్యాన్ని అమ్మేందుకు సిద్ధమైతే ఫలానా మిల్లు యజమాని వద్దకు వెళ్లి నా పేరు చెప్పాలని మీ ధాన్యం కొనుగోలు చేస్తారని రైతుకు తెలుపుతున్నారు.వెంటనే బ్రోకర్లు రైస్ మిల్ యజమానికి ఫోన్ చేసి ఫలానా ట్రాక్టర్ వస్తుంది ఈ రేటు మీద ధాన్యం కొనుగోలు చేయాలని సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తుంది. దాన్యం లోడ్ తో కూడిన ట్రాక్టర్ మిల్లుల వద్దకురైతులు తీసుకు వెళ్లిన పిదప మిల్లుల యజమానులు తేమశాతం తాలు ఉన్నదని సరిగా ఎండ లేదని, పచ్చిగా ఉన్నాయని నానా ఇబ్బందులకు రైతులను గురి చేస్తున్నారు.రైస్ మిల్లు వద్ద ధాన్యం బస్తాల్లో తీసుకు రాకున్న ప్రతి ట్రాక్టర్ దిగుమతి పేర రూ.100లు హమాలీ రూల్స్ చెల్లించాల్సిందే.

ధాన్యానికి తుది రేటు నిర్ణయించిన తదుపరి బిల్లు ఇచ్చే సమయంలో ప్రతి ట్రాక్టర్ లోడుకు 30 కేజీల తరుగు కట్ చేసుకుని బిల్లు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైస్ మిల్లుల వద్ద జోరుగా సీసీ కటింగ్……..రైస్ మిల్లుల వద్ద ధాన్యం అమ్మిన రైతులకు ధాన్యానికి డబ్బులు రావాలంటే నెల రోజులు తప్పనిసరిగా ఆగాల్సిందేనని, ఒకవేళ రైతుకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉండి వెంటనే కావాలంటే సీసీ కటింగ్ ద్వారా ధాన్యం డబ్బులను మరుసటి రోజు చెల్లిస్తున్నారు. సీసీ కటింగ్ ప్రతి రూ వంద రూపాయలకు రెండు రూపాయలు మిల్లు యజమాన్యానికి చెల్లించాల్సిందే అలా చెల్లిస్తేనే మరుసటి రోజు ధాన్యానికి పూర్తి డబ్బులను అందజేస్తున్నారు. లేని పక్షంలో 30 రోజులపాటు మిల్లుల చుట్టు రైతులు తిరగాల్సిందే.